ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా రోడ్డు పనులు చేపట్టాలి: జిల్లా ఎస్పీ
సంగారెడ్డి, అక్టోబర్ 8 (సందేశం టైమ్స్ ప్రతినిధి ): సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనగూడ వరకు కొనసాగుతున్న జాతీయ రహదారి–65 (ఎన్హెచ్-65) రోడ్డు విస్తరణ పనులను సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనుల పురోగతిని ఆర్అండ్బీ ఇంజినీర్లు, సంబంధిత కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తికావడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలను తెలుసుకుని, పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు విస్తరణ పనుల కారణంగా ప్రజలు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలని తెలిపారు. రోడ్డు పనులు కొనసాగుతున్న సమయంలో ప్రమాదాలకు తావులేకుండా భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన, సురక్షితమైన రహదారి సౌకర్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో జిన్నారం డీఎస్పీ ప్రభాకర్, ఇస్నాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, ఆర్అండ్బీ ఇంజినీర్లు, సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.