సూర్యాపేట జిల్లా నుంచి రాష్ట్రస్థాయి గట్కా పోటీలకు నలుగురు విద్యార్థుల ఎంపిక
సూర్యాపేట, అక్టోబర్ 5 – సందేశం టైమ్స్ ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వత్సల్య ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం SGFI ఆధ్వర్యంలో నిర్వహించిన 70వ SGFI యూనిఫైడ్ నల్గొండ జిల్లా స్థాయి గట్కా పోటీల్లో సూర్యాపేట జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన అండర్-14 బాలబాలికలు పాల్గొన్న ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. SGFI, యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధిత అధికారుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీల్లో సూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడ, నడిగూడెం, అనంతగిరి ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రతిభ ఆధారంగా అండర్-14 విభాగంలో సూర్యాపేట జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-14 బాలుర విభాగంలో కంకణాల స్వామి నందన్, బాలికల విభాగంలో మోకా అక్షయ, కొండపల్లి శ్రీ నిత్య, షేక్ జాస్మిన్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు, గట్కా అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి సూర్యాపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా గట్కా స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కొండపల్లి క్రాంతి కుమార్ తెలిపారు.