60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం.. మునగాలలో రూ.9.60 కోట్లతో కమ్యూనిటీ కిచెన్
సూర్యాపేట, అక్టోబర్ 4 – సందేశం టైమ్స్ ప్రతినిధి: సూర్యాపేట జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించే లక్ష్యంతో మునగాల మండలంలో రూ.9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మునగాల మండలంలో జాతీయ రహదారి పక్కన మునగాల–మాధారం మధ్య ఎంపిక చేసిన స్థలంలో కేంద్రీకృత వంటశాలను నిర్మించనున్నారు. ఒకే కేంద్రంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు అవసరమైన అల్పాహారాన్ని తయారు చేసి, ప్యాకింగ్ చేసి, ప్రత్యేక వాహనాల ద్వారా ఆయా విద్యాసంస్థలకు తరలించి పంపిణీ చేసే విధంగా ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. దేశంలోనే అత్యాధునిక సదుపాయాలతో కమ్యూనిటీ కిచెన్ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సింగరేణి సంస్థ నుంచి లభించిన రూ.9.60 కోట్ల విరాళంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేసిన విజ్ఞప్తుల మేరకు సింగరేణి సంస్థ ఈ నిధులను సమకూర్చినట్లు తెలిపారు. హరేకృష్ణ మూవ్మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో ప్రాజెక్టును అమలు చేయనున్నారు. జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని దాదాపు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం ఈ కమ్యూనిటీ కిచెన్ ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి ఎంపిక చేసిన కొన్ని జూనియర్ కళాశాలలకు మధ్యాహ్న భోజనం అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆహార తయారీ, ప్యాకింగ్, రవాణా, పంపిణీ ప్రక్రియలో నాణ్యత, పరిశుభ్రత, పోషక విలువలు, సురక్షిత నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థులకు పాఠశాల వేళల్లో నాణ్యమైన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, సంక్షేమానికి తోడ్పడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం, నిర్వహణ, ఆహార తయారీ, విద్యాసంస్థలకు సరఫరా తదితర అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, సంబంధిత అధికారులు, అమలు భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ పనుల పురోగతిని సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. నిర్మాణం పూర్తయిన అనంతరం ఈ కమ్యూనిటీ కిచెన్ ద్వారా సూర్యాపేట జిల్లాలోని వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందుబాటులోకి రానుంది.