Blog

కోదాడలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన ఇన్‌పేషెంట్ విభాగం ప్రారంభం

October 4, 2026
By Sandesham Times Admin

కోదాడ, అక్టోబర్ 4 – సందేశం టైమ్స్ ప్రతినిధి: కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఇన్‌పేషెంట్ విభాగాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కోదాడ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు. నూతన 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. రూ.26 కోట్లతో చేపట్టిన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఆసుపత్రి రెనోవేషన్‌తో పాటు నూతనంగా నిర్మించిన ఎగ్జిస్టింగ్ బ్లాక్, ఇన్‌పేషెంట్ విభాగం పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. నేటి నుంచి ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినందున కోదాడ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో లభించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్యం అందేలా వైద్యులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రావడంతో కోదాడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం మరింత చేరువ కానుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ పెండెం వెంకటరమణ, డీసీహెచ్ వెంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్, వైద్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Get the Full Experience

Download the official Sandesham Times App for your daily dose of verified Telugu news.

Get it on Google Play