నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాహుల్ గాంధీకి ఉత్తరాల ఉద్యమం
హైదరాబాద్, సందేశం టైమ్స్ ప్రతినిధి, 17-06-2026: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లేందుకు రేపు నిరుద్యోగుల తరఫున పెద్ద ఎత్తున ఉత్తరాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాజీ ఏఐసీసీ సభ్యులు, మాజీ ఏపీవీసీసీ చైర్మన్ బక్క జడ్సన్ తెలిపారు. తెలంగాణలో లక్షలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం నిరుద్యోగ యువత ఆశగా ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి పంపే ఉత్తరాలలో ప్రధానంగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 మరియు DSC ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం 67,760 ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటిస్తున్నప్పటికీ, ఆ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, శాఖల వారీగా నియామకాల లెక్కలను ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది యువత పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో, కనీసం 20,000 పోలీస్ పోస్టులతో కొత్త నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్సై అభ్యర్థుల వయోపరిమితిని 37 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు జీవో నెం.46 వల్ల నష్టపోయిన అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో శ్రీమతి ప్రియాంక గాంధీ ప్రకటించిన నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత రెండు నెలల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ తీవ్ర నిరాశకు గురై మంచిర్యాలకు చెందిన హరీష్, ఆదిలాబాద్‌కు చెందిన కంబ్లే అమిత్ కుమార్, పెద్దపల్లికి చెందిన ముదటనపల్లి చరణ్, మంచిర్యాలకు చెందిన కిరణ్, హైదరాబాద్‌కు చెందిన నెనావత్ సిద్ధార్థ్, ఖమ్మంకు చెందిన భవాని అనే ఆరుగురు నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఘటనలపై ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ డిమాండ్లకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతోందని, అందులో భాగంగా నల్గొండ మరియు ఖమ్మం జిల్లాల్లో నిరుద్యోగ యువత నుంచి భారీగా సంతకాలు సేకరించడం జరిగిందని పేర్కొన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, యువత భవిష్యత్తుతో ఆటలు ఆడకుండా పారదర్శకమైన ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని, నిరుద్యోగుల గొంతుకను రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ఉత్తరాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బక్క జడ్సన్ హెచ్చరించారు.