వాయిల సింగవరం మత్స్య సహకార సంఘ నిధుల దుర్వినియోగంపై విచారణ
అనంతగిరి, ఆగస్టు 18: అనంతగిరి మండలం వాయిల సింగవరం మత్స్య సహకార సంఘంలో రూ.26 లక్షల నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీలు, అవినీతి ఆరోపణలపై సంఘ సభ్యులు కంటు కృష్ణ, రేవూరి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ సుజాత ఆధ్వర్యంలో సంఘ కార్యాలయంలో జరిగిన విచారణలో సంఘ కార్యవర్గ సభ్యులు, సభ్యులను విచారించి వివరాలు సేకరించారు. 2016 మే 2న తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఏర్పాటు చేసిన ఫోర్‌మెన్ కమిటీ ఓపెన్ టెండర్ ద్వారా చేపలు విక్రయించగా రూ.26 లక్షలు సమకూరినట్లు, ఆ మొత్తాన్ని సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం కోర్టు ఆదేశాలతో సంఘ అధ్యక్షుడు కంటు నాగార్జున రూ.9 లక్షలు డ్రా చేయగా, మిగిలిన రూ.16 లక్షలను మత్స్యశాఖ బ్యాంకు ఖాతాలో ఉంచినట్లు వివరించారు. 2021 అక్టోబర్ 11న నూతన పాలకవర్గం ఏర్పడిన అనంతరం జరిగిన తొలి మహాజనసభలో సంఘ ఆర్థిక లావాదేవీల కోసం మునగాల ఎన్‌డీసీసీ బ్యాంకులో సంఘ ఖాతా ప్రారంభించి, మిగిలిన రూ.16 లక్షలను సంఘ ఖాతాలోకి బదిలీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ మొత్తాన్ని సంఘ సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా, మహాజనసభ నిర్వహించకుండానే అధ్యక్షుడు కంటు నాగార్జున మునగాల బ్యాంకు నుంచి తప్పుడు తీర్మానాల ద్వారా అక్రమంగా డ్రా చేసి వినియోగించుకున్నారనే ఆరోపణలపై విచారణ కొనసాగింది. కాగా విచారణకు హాజరుకావాల్సిన అధ్యక్షుడు కంటు నాగార్జున తన ఆరోగ్యం బాగోలేదని కారణం చూపుతూ హాజరుకాలేదు. గత నెల జూలై 18న కూడా తన భార్య ఆరోగ్యం బాగోలేదని పేర్కొంటూ విచారణకు హాజరు కాలేనని లేఖ ద్వారా అధికారులకు తెలిపినట్లు విచారణ అధికారి తెలిపారు. విచారణలో సంఘ కార్యదర్శి, జాయింట్ చెక్ పవర్ కలిగిన కంటు నాగేశ్వరరావును అధికారులు ప్రశ్నించగా, తనకు విచారణ గురించి ముందస్తు సమాచారం లేదని, అధ్యక్షుడు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, గ్రామంలో టామ్‌టామ్ ద్వారా విచారణ విషయం తెలిసిందని తెలిపారు. అధ్యక్షుడిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలతో శనివారం మత్స్యశాఖ కార్యాలయంలో పూర్తి వివరాలు అందజేస్తానని ఆయన అధికారులకు తెలిపారు. మరోవైపు గత ఐదేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించలేదని, కార్యవర్గ సభ్యులకు సమాచారం లేకుండానే నిధులను డ్రా చేసి వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని కొంతమంది సంఘ సభ్యులు విచారణ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నూతన సభ్యత్వాల అంశంపై ప్రశ్నించగా, ఆ వ్యవహారం హైకోర్టు పరిధిలో విచారణలో ఉందని జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామి తెలిపారు. ప్రస్తుతం సంఘ అధ్యక్షుడు కంటు నాగార్జునపై వచ్చిన ఆర్థిక లావాదేవీలు, అక్రమాలు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన అంశాలపైనే విచారణ నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు ఒకసారి విచారణ వాయిదా పడినప్పటికీ, రెండోసారి కూడా విచారణకు గైర్హాజరు కావడంపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాగే కార్యవర్గ సభ్యులకు సరైన నోటీసులు ఇవ్వకపోవడం, సంఘ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పుస్తకాలు, వాటాదారుల వివరాలు, ఆడిట్ రికార్డులు, మినిట్స్, తీర్మానాల పుస్తకాలు తదితర కీలక రికార్డులు అధ్యక్షుడి వద్ద ఉన్నప్పటికీ అధికారులు ఇప్పటివరకు స్వాధీనం చేసుకోలేదని సభ్యులు ఆరోపించారు. దీంతో అధికారుల వ్యవహారశైలిపై తమకు అనుమానాలు ఉన్నాయని కొంతమంది సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అనంతగిరి ఎస్‌ఐ ఏడుకొండల ఆధ్వర్యంలో ఏఎస్‌ఐలు లింగారెడ్డి, జానీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ జి.ఉపేందర్‌తో పాటు సంఘ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.