వాయిలసింగారం పెద్ద వాగు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి
వాయిలసింగారం, జూన్ 15 (సందేశం టైమ్స్): మండల పరిధిలోని వాయిలసింగారం చెరువు కింద ఉన్న పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి కాంగ్రెస్ నాయకుడు నరేందర్, వార్డు సభ్యుడు నాగరాజు, రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద వాగు కారణంగా వ్యవసాయ భూములకు వెళ్లాల్సిన రైతులు నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల రైతులు పొలాలకు చేరుకోలేకపోతున్నారని, దీంతో వ్యవసాయ పనులు నిలిచిపోవడంతో పాటు వందల ఎకరాల్లో సాగు చేస్తున్న పంటలకు నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించి త్వరలోనే అవసరమైన నిధులు మంజూరు చేసి పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రైతుల రాకపోకలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు వ్యవసాయాభివృద్ధికి దోహదపడే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని వారు కోరారు.