రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ అరెస్టులు అప్రజాస్వామికం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, అక్టోబర్ 6 – సందేశం టైమ్స్ ప్రతినిధి: ఓట్ల చోరీ, ఎన్నికల అక్రమాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశాలపై ప్రశ్నిస్తూ ఢిల్లీలో నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వైపు కాంగ్రెస్, ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యలు ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే ప్రయత్నంగా మంత్రి పొంగులేటి అభివర్ణించారు. అరెస్టులు, లాఠీచార్జీలు, కేసులతో ఓట్ల చోరీపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని అణచలేరని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన తప్పిదాలకు బాధ్యత వహించి రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.