భర్త ప్రేమతో చదివించాడు.. ఉద్యోగం వచ్చేలా చేశాడు.. విధి మాత్రం మెదడులో కణితిని మిగిల్చింది.. చూపు కోల్పోయే ప్రమాదంలో భార్య.. ఆపరేషన్‌కు దాతల సాయం కోసం కన్నీటి వేడుకోలు
బృందావనపురం, ఆగస్టు 11: సందేశం టైమ్స్ ప్రతినిధి
నడిగూడెం మండలం బృందావనపురం గ్రామానికి చెందిన కంభంపాటి రాజసులోచన తన భర్త సోమయ్యతో ప్రేమ వివాహం చేసుకున్న అనంతరం అనేక ఆరోగ్య, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ప్రభుత్వ సహాయం కోసం వేడుకుంటున్నారు. రాజసులోచన తెలిపిన వివరాల ప్రకారం, తాను 10వ తరగతి చదువుతున్న సమయంలో సోమయ్యను ప్రేమ వివాహం చేసుకున్నానని, వివాహం అనంతరం తన భర్త ఎంతో ప్రేమతో ఇంటర్మీడియట్‌తో పాటు స్టాఫ్ నర్సు విద్యను చదివించారని తెలిపారు. స్టాఫ్ నర్సుగా స్థిరపడిన అనంతరం తనకు గుండె సంబంధిత సమస్య రావడంతో భర్త వైద్య చికిత్స చేయించారని, అనంతరం కంటి సమస్యలు తలెత్తడంతో కోదాడలోని కంటి ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా ఒక కన్ను చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో రెండో కన్నుకు కూడా చూపు కోల్పోయే అవకాశం ఉందని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కూడా వైద్యులను సంప్రదించగా అక్కడి వైద్యులు సైతం ఇదే విషయాన్ని తెలిపారని చెప్పారు. కంటి చూపు ఎందుకు కోల్పోతుందో తెలుసుకోవాలంటే సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్‌లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడికి వెళ్లి ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ చేయించగా మెదడులో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారని తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేయించాల్సి ఉంటుందని, లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు సూచించినట్లు రాజసులోచన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రేమ వివాహం చేసుకోవడం ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో వివాహం అనంతరం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రస్తుతం ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తీవ్ర సమస్యల్లో ఉన్నామని తెలిపారు. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరించే స్థోమత తమకు లేకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి తన వైద్య చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందించి ఆదుకోవాలని కంభంపాటి రాజసులోచన, ఆమె భర్త సోమయ్య వేడుకుంటున్నారు.