డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నేతల ఆందోళన లోకేష్ రాజీనామా చేయాలి.. సీబీఐ విచారణకు ఎందుకు భయం?: కొడాలి నాని, అంబటి, అవినాష్ రెడ్డి
సందేశం టైమ్స్ ప్రతినిధి | ఆగస్టు 10: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలను తొక్కిపెట్టాలని చూస్తే మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్‌ను కాపాడేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమాలు జరగకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో చంద్రబాబు కోరిన మేరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ జగన్‌పై సీబీఐ విచారణకు ఆదేశించారని, ఇప్పుడు దమ్ముంటే అదే తరహాలో లోకేష్‌పై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి రాష్ట్రంలోనూ రావాలని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో లోకేష్‌తో కలిసి నడిచిన వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. జీవో నంబర్లు 4, 47 తీసుకొచ్చి డీఎస్సీలో అక్రమాలకు పాల్పడ్డారని, కేవలం సర్టిఫికెట్ తీసుకొస్తే ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంలో వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతో టీడీపీ నేతలు ఉన్నారని అన్నారు. పొన్నూరు, చిలకలూరిపేట, విజయవాడలో నిరసనలకు ఏర్పాటు చేసిన టెంట్లను పోలీసులు తొలగించడాన్ని ప్రశ్నిస్తూ పోలీసుల పని టెంట్లు పీకడమేనా అని నిలదీశారు. డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటాలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. డీఎస్సీ విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా జీవోలు జారీ చేసుకుందని విమర్శించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.