అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ మహిళ మృతి
మరిపెడ, అక్టోబర్ 2 – సందేశం టైమ్స్ ప్రతినిధి: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన వివాహిత దుర్మరణం చెందారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన దారం సుప్రియ (31) ఉద్యోగరీత్యా కొంతకాలంగా అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆమె కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్ బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు సుప్రియ తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిసింది. అదే కారులో ప్రయాణిస్తున్న భారత్కు చెందిన మరో యువతికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సుప్రియ మృతితో మరిపెడలోని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.